ప్రజల హక్కుల కోసం MROను ఆశ్రయించిన వైఎస్ఆర్సిపి నేతలు..!!
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
రాంబిల్లి మండలం గజరెడ్డిపాలెం గ్రామ సరిహద్దుల్లో రెన్యూ సోలార్ కంపెనీ ఏర్పాటు చేసిన భారీ ఫెన్సింగ్ కారణంగా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు స్పందించి మండల తహశీల్దార్ (MRO)కు వినతి పత్రం సమర్పించారు.
సోలార్ కంపెనీ నిర్మించిన ఫెన్సింగ్ వల్ల గ్రామం పూర్తిగా నిర్బంధంలోకి వెళ్లిపోయిందని, గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారులు మూసుకుపోయాయని, స్మశాన వాటిక, దేవాలయాల భూములు, వరద నీటి మార్గాలు మరియు సంప్రదాయ మత్స్యకారుల ఉపాధి దెబ్బతిన్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల జీవన హక్కులు, రాకపోకల హక్కులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని వారు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో భూసేకరణ, పునరావాస మరియు పునఃనిర్మాణ చట్టం–2013 ప్రకారం గజరెడ్డిపాలెం గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి పూర్తి స్థాయి ఆర్ అండ్ ఆర్ (R&R) ప్యాకేజీ అందించాలని, లేదా ప్రత్యామ్నాయంగా గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి 14 ప్రధాన డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని కోరుతూ MRO కు వినతి పత్రం అందజేశారు.
గ్రామానికి శాశ్వత రహదారి అనుసంధానం కల్పించడం, స్మశాన వాటికకు ప్రత్యామ్నాయ స్థలం ఏర్పాటు, వరద నీటి కాలువల నిర్మాణం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, తుఫాను పునరావాస కేంద్రం ఏర్పాటు వంటి కీలక అంశాలను వినతి పత్రంలో ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నియోజకవర్గ బీసీ సెల్ కార్యదర్శి చేపల గోవింద్, ఎంపీపీ శ్రీను బాబు, జెడ్పీటీసీ నాగరాజు తదితరులు పాల్గొని గ్రామ ప్రజల తరపున అధికారులను కలిసి సమస్యల తీవ్రతను వివరించారు.
అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి గజరెడ్డిపాలెం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వైఎస్ఆర్సిపి నాయకులు డిమాండ్ చేశారు.