ఆపరేషన్ క్లీన్ స్వీప్”తో చెత్తపై యుద్ధం.. ప్రజల భాగస్వామ్యమే లక్ష్యమని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపు
( క్రైమ్ అనాలసిస్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలోని యలమంచిలి మున్సిపాలిటీ టౌన్ ఫైర్ ఆఫీస్ కాలనీలో నిర్వహించిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఒక రాష్ట్రం – ఒక పరిశుభ్రత లక్ష్యం” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ శ్రమదాన కార్యక్రమంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొని స్వయంగా పరిశుభ్రత పనుల్లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో చేపడుతున్న పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా రోడ్లు, డ్రెయిన్లు, కాలనీలు మరియు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగునీటి సమస్యలు మరియు కాలుష్యంపై ప్రత్యేక దృష్టి సారించి అధికారులు, యువకులు, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు కలిసి శ్రమదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి పరిశుభ్రమైన పరిసరాలు ఎంతో అవసరమని అన్నారు. వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్న చెత్తను పూర్తిస్థాయిలో తొలగించేందుకు ప్రభుత్వం ప్రతి బుధవారం “స్వచ్ఛ బుధవారం” పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ప్రధాన వీధులతో పాటు సందులు, కాలనీల్లో కూడా పరిశుభ్రత పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొంటూ, ప్రజలంతా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అధికారులు, కూటమి నాయకులు, యువకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.