మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన..!!

మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన..!!

27/May/2026 08:17    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :

యలమంచిలి రూరల్ పరిధిలోని మై హోమ్ ఇండస్ట్రీస్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు.
కార్మికులు మాట్లాడుతూ, తమకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు అందడం లేదని, అలాగే కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 16 సంవత్సరాలుగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నామని, ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములు ఇచ్చి ఉపాధి కోల్పోయిన నిరాశ్రయులమయ్యామని తెలిపారు. అయినప్పటికీ తమకు తగిన గౌరవం ఇవ్వకుండా హీనంగా చూస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం రోజుకు రూ.480 డైలీ వేజ్ చెల్లిస్తున్నారని, ఈఎస్ఐ, పీఎఫ్ కోతల తర్వాత నెలకు సుమారు రూ.12 వేల మాత్రమే చేతికి వస్తోందన్నారు. తమకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వాలని, పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా మెడికల్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. అదనంగా క్యాంటీన్ సదుపాయం, డ్యూటీ సమయంలో టీ, స్నాక్స్, విశ్రాంతి గది ఏర్పాటు చేయాలని, ప్రతి సంవత్సరం బోనస్ ఇవ్వాలని కోరారు.
ఈ విషయమై ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను వివరణ కోరగా, ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో స్థానికులను కాంట్రాక్ట్ కార్మికులుగా తీసుకునేందుకు కాంట్రాక్టర్ల ద్వారా నియామకాలు చేపట్టామని తెలిపారు. వారి విద్యార్హతలకన్నా నైపుణ్యాన్ని ఆధారంగా చేసుకుని ఉపాధి కల్పించామని చెప్పారు. కార్మికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని, ప్రస్తుతం వారు వినిపిస్తున్న డిమాండ్లపై కంపెనీ ఉన్నతాధికారులు మరియు కాంట్రాక్టర్లతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికులు ఆందోళన చెందవద్దని, సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.
Breaking News

Subscribe our Newsletter