ఎలమంచిలి: మండలంలోని పేట బయ్యవరం, పులపర్తి గ్రామాల్లో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తల సంయుక్త ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి మోహన్ రావు ప్రత్యేక అభ్యర్థన మేరకు ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా అధికారులు, శాస్త్రవేత్తలు గ్రామాల్లోని వరి నారుమడులను విస్తృతంగా సందర్శించి, పంటల పరిస్థితిని సమీక్షించారు. అనంతరం రైతులకు పలు కీలక సూచనలు చేశారు.
- ఆరోగ్యంగా నారుమడులు: ప్రస్తుతం గ్రామాల్లోని వరి నారుమడులు ఆరోగ్యంగా ఉన్నాయని అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
- ఎదుగుదలకు పోషకాలు: ఆలస్యంగా వేసిన నారుమడులు త్వరగా ఎదిగి, నష్టపోకుండా ఉండాలంటే అవసరాన్ని బట్టి రెండు కేజీల యూరియా లేదా ఒక కేజీ డీఏపీ (DAP) వేసుకోవాలని సూచించారు.
- ఎల్నీనో ప్రభావంపై అప్రమత్తత: వ్యవసాయ శాస్త్రవేత్తలు రవికుమార్, శశికళ, రామలక్ష్మి గారు మాట్లాడుతూ.. ప్రస్తుత ఎల్నీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతు సోదరులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
- నీటి యాజమాన్యం: వాతావరణ మార్పులకు అనుగుణంగా నీటి లభ్యతను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు.
1, MTU-1124, MTU-1121, NLR-34449, MTU-1290, MTU-1293 వంటి మధ్యస్థ లేదా స్వల్పకాలిక రకాలు వేసుకోవటం
2. ఇప్పటికే విత్తిన నారుమళ్లకు ప్రాణరక్షక నీటిపారుదల.
3. ప్రత్యేక యాజమాన్యంతో ముదిరిన నారుమొక్కలను నాటడం (దగ్గరగా నాటడం - చ.మీ.కు 44 మొక్కలు, ఒక గుంటకు 4-5 మొక్కలు).
4. నత్రజనిని 3 విడతలకు బదులుగా 2 విడతలుగా, అందులో 2/3 వంతును మొదలు ఎరువుగా వేయడం
5. వరిని నేరుగా వరి డ్రమ్ సీడర్‌తో విత్తడం లేదా మొలకెత్తిన విత్తనాలను వెదజల్లడం.
7. నీటి పారుదలలో వంతుల వారీ పద్ధతిని పాటించాలి. నీటిని ఆదా చేయడానికి, ప్రాథమిక మొలకెత్తే దశ వరకు ఒకదాని తర్వాత ఒకటిగా తడపడం, ఆరబెట్టడం అనే పద్ధతిని పాటించండి.
8. వరి పంటను వేయలేని తీవ్రమైన నీటి ఎద్దడి పరిస్థితులలో పెసర, పిల్లిపెసర, అలసంద, పశుగ్రాస
మొక్కజొన్న, జొన్న మరియు స్టైలో హేమాటా వంటి పంటలను వేసుకోవటం
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాలలో వ్యవసాయం ప్రధానంగా నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాంతంలో పంటల పెరుగుదల మరియు ఉత్పాదకతను నిర్ణయించడంలో రుతుపవన వర్షాలు సకాలంలో ప్రారంభం కావడం మరియు సమానంగా విస్తరించడం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. అయితే, ఇటీవలి కాలంలో వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాత నమూనాలలో గణనీయమైన వైవిధ్యం కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన తాజా దీర్ఘకాలిక అంచనా ప్రకారం, జూన్ 2026 తర్వాత ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల ఖరీఫ్ సీజన్‌లో (జూన్-సెప్టెంబర్) ఉత్తర కోస్తా ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ రుతుపవన వర్షాలు మరియు కరువు లాంటి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇటువంటి అనిశ్చిత వాతావరణ పరిస్థితులలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు రూపొందించవలసిన అవసరం ఉంది.
సాధారణ విత్తనాల నాటే కాలం కంటే రుతుపవనాలు రెండు, నాలుగు, ఆరు మరియు ఎనిమిది వారాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే వివిధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా జిల్లాల కోసం ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికలో తేలికపాటి మరియు బరువైన వర్షాధార నేలలకు అనువైన ప్రత్యామ్నాయ పంటలు, వాటి అనుకూల రకాలు మరియు ఆయా పరిస్థితులకు తగిన పంటల విధానాలు సూచించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రైతులు మరియు వ్యవసాయ సహాయక సిబ్బంది పాల్గొన్నారు