పిఎసిఎస్ ఉద్యోగులతో ప్రభుత్వ చర్చలు సఫలం

పిఎసిఎస్ ఉద్యోగులతో ప్రభుత్వ చర్చలు సఫలం

25/February/2026 20:02    Share:   


యలమంచిలి : పిఎసిఎస్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో పిఎసిఎస్ ఉద్యోగులు నిరవధిక సమ్మెను విరమించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత పది రోజులుగా కొనసాగుతున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల నిరవధిక సమ్మె ఎట్టకేలకు విరమించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, కీలకమైన హామీలు ఇవ్వడంతో జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మెను విరమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిందని అనకాపల్లి జిల్లా విశాఖ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు రాయవరపు శివరామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చర్చల ఫలితంగా పీఏసీఎస్‌ ఉద్యోగులందరికీ 20 శాతం వేతన పెంపును వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అలాగే ఉద్యోగుల సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకుని గ్రాట్యుటీ పరిమితిని ₹2 లక్షల నుండి ₹4 లక్షలకు పెంచడంతో పాటు, ప్రతి ఉద్యోగికి ₹5 లక్షల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించేందుకు అంగీకరించిందని అన్నారు. ఈ నిర్ణయాలకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులను విడుదల చేయనుందని, ఫిబ్రవరి 16న ప్రారంభమైన ఈ సమ్మె కారణంగా గ్రామాల్లో నిలిచిపోయిన ఎరువుల పంపిణీ, రుణాల మంజూరు వంటి సహకార సేవలు ఇప్పుడు తిరిగి ప్రారంభం కానున్నాయని తెలిపారు. తమ పోరాటానికి మద్దతుగా నిలిచిన మీడియాకు, సహకరించిన అధికారులకు, ఇతర ఉద్యోగ సంఘాలకు, పీఏసీఎస్‌ ఉద్యోగుల సంఘం నేతలు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.
Breaking News

Subscribe our Newsletter