అనకాపల్లి: వైఎస్సార్‌సీపీ నాయకులు "చలో దుప్పితూరు" కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, బొడ్డేడ ప్రసాద్, ధర్మశ్రీ, ఎమ్మెల్యే వర్దు కళ్యాణి, మాజీ ఎంపీ సత్యవతి మరియు కంబాల జోగులు పాల్గొన్నారు. నాయకులు గ్రామస్తులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ, పరిశ్రమలు రావాలన్నది వైఎస్ జగన్ విధానమని, అయితే ప్రజలను ఇబ్బంది పెడితే ఆయన ఉపేక్షించరని స్పష్టం చేశారు.గ్రామంలోని 750 కుటుంబాలకు ఇంకా పరిహారం అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామాన్ని తరలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.పరిహారం అందే వరకు ఎలాంటి గోడ నిర్మాణాలు చేపట్టరాదని డిమాండ్ చేశారు.గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలపై లాఠీఛార్జ్ చేయడం అన్యాయమని, ప్రజల డిమాండ్లు న్యాయమైనవని అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రజలపై పెట్టిన అక్రమ కేసులను వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తివేస్తారని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు వైఎస్ జగన్ కూడా బాధితులకు తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చినట్లు ఆయన తెలిపారు.