యలమంచిలి : యలమంచిలి మండల పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను సోమవారం అధికారులు విడుదల చేశారు. మండల ఎన్నికల అధికారి, ఇన్‌ఛార్జ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి. దీపిక, ఇన్‌ఛార్జ్ పంచాయతీ విస్తరణ అధికారి గిరి ప్రసాద్, ఇతర సిబ్బందితో కలిసి ఈ ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రచురించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వి. దీపిక మాట్లాడుతూ... ఈ నెల 18వ తేదీ బుధవారం నుంచి మండలంలో గుర్తించిన 8 నామినేషన్ కేంద్రాలలో అభ్యర్థుల నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. నామినేషన్ సెంటర్లు అనగా ఏటికొప్పాక, బయ్యవరం, పులపర్తి, కృష్ణాపురం, పోతిరెడ్డిపాలెం, పురుషోత్తపురం, లైన్ కొత్తూరు, శేఖాలిపాలెం, ఈ 8 కేంద్రాలలో నియమించబడిన స్టేజ్-1 ఎన్నికల అధికారుల సమక్షంలో నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని, ఆసక్తి గల అభ్యర్థులు నిబంధనల ప్రకారం నామినేషన్లు దాఖలు చేయాలని ఎంపీడీఓ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.