అనకాపల్లి, అక్టోబర్ 23: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే అర్హులైన అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఎస్పీ స్పష్టం చేశారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా, నామినేషన్ల దాఖలుకు ఆటంకాలు కలిగించినా వెంటనే స్థానిక పోలీసులను లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు. అవసరమైన వారికి భద్రత కల్పించి, నామినేషన్ దాఖలు చేసేందుకు సహకరిస్తామని తెలిపారు.
ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించినా, శాంతిభద్రతలకు భంగం కలిగించినా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు అభ్యర్థులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్
శ్రీనివాసరావు అప్పికొండ