ప్రయాణికుడిని ప్రాణాలకు తెగించి కాపాడిన హెడ్ కానిస్టేబుల్ ..

ప్రయాణికుడిని ప్రాణాలకు తెగించి కాపాడిన హెడ్ కానిస్టేబుల్ ..

15/September/2026 19:02    Share:   

రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడిని ప్రాణాలకు తెగించి కాపాడిన అనకాపల్లి జిల్లా హెడ్ కానిస్టేబుల్ 
ఎలమంచిలి రూరల్ హెచ్‌సీ చంద్రరావు  
రైలు ప్రమాదంలో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్ చంద్రరావుకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ అభినందనలు సాహసోపేత సేవలకు గుర్తింపుగా నగదు రివార్డు, ప్రశంసా పత్రం అందజేత 
​"యూనిఫాంలో ఉన్నా లేకున్నా ప్రజల ప్రాణరక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యం" - జిల్లా ఎస్పీ 

తుని(అనకాపల్లి), సెప్టెంబర్ 14: 

తుని రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి తీవ్ర గాయాలపాలైన ఓ ప్రయాణికుడి ప్రాణాలను అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు (HC-496) ప్రాణాలకు తెగించి కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు.
​విశాఖపట్నం నుండి అలప్పీ వెళ్తున్న ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ తుని రైల్వే స్టేషన్ సమీపంలో నెమ్మదిగా కదులుతున్న సమయంలో, ఓ గుర్తుతెలియని ప్రయాణికుడు రైలు ఎక్కేందుకు ప్రయత్నించి అదుపుతప్పి బోగీ కింద పట్టాలపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ఉన్న పలువురు భయంతో వీడియోలు తీస్తూ ఉండిపోగా, అదే రైలులో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు.
​రైలు ఆగిన వెంటనే కిందకు దిగి, ఏమాత్రం సంకోచించకుండా బోగీ కిందకు పాకుతూ వెళ్లి తీవ్ర గాయాలతో పట్టాల మధ్య చిక్కుకున్న ప్రయాణికుడిని ఒడుపుగా బయటకు లాగి రక్షించారు. అనంతరం బాధితుడిని చికిత్స నిమిత్తం అత్యవసరంగా సమీప ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.
​సమయస్ఫూర్తితో వ్యవహరించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రయాణికుడిని రక్షించిన హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు సాహసానికి రైల్వే సిబ్బంది, ప్రయాణికులు మరియు ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర ఇతర ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. "విధి నిర్వహణలోనే కాకుండా ఎల్లవేళలా ప్రజల రక్షణే పోలీసుల ధ్యేయం" అని చంద్రరావు నిరూపించారని స్థానికులు కొనియాడారు.
Breaking News

Subscribe our Newsletter