ఏటికొప్పాక–పులపర్తి NH-5 రహదారి కష్టాలు..?

ఏటికొప్పాక–పులపర్తి NH-5 రహదారి కష్టాలు..?

04/September/2026 07:11    Share:   

ప్రపంచ ఖ్యాతిగాంచిన ఏటికొప్పాకకు రహదారి కష్టాలు.. రైల్వే గేటుతో ప్రజలకు తప్పని అవస్థలు

అనకాపల్లి జిల్లా, (CA న్యూస్ – రిపోర్టర్ ఆనంద్):

ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఏటికొప్పాక గ్రామానికి రహదారి సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ అయిన ఏటికొప్పాక నుంచి పులపర్తి మీదుగా NH-5 ప్రధాన రహదారికి వెళ్లే రహదారి సక్రమంగా లేకపోవడంతో ప్రజలు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఏటికొప్పాక–పులపర్తి NH-5 రహదారి అభివృద్ధి చెందకపోవడంతో అత్యవసర సమయంలో అంబులెన్సులు, ఆటోలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు నిత్యం ఈ మార్గంపైనే ఆధారపడాల్సి వస్తుండటంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది.
అదేవిధంగా ఏటికొప్పాక నుంచి పద్మనాభరాజుపేట వైపు వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే గేటు మరో ప్రధాన సమస్యగా మారింది. రైళ్ల రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయని, కొన్ని సందర్భాల్లో 30 నిమిషాలకు పైగా వేచి ఉండాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఈ ఆలస్యం ఆందోళన కలిగిస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏటికొప్పాకకు పర్యాటకులు, సందర్శకులు అధికంగా వస్తున్న నేపథ్యంలో ఏటికొప్పాక నుంచి పులపర్తి–NH-5 రహదారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు రైల్వే గేటు వద్ద అండర్‌పాస్ లేదా ఆర్‌ఓబీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
స్థానిక ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, రైల్వే శాఖల అధికారులతో సమన్వయం చేసి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఏటికొప్పాక–పులపర్తి NH-5 రహదారి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Breaking News

Subscribe our Newsletter