భవిష్యత్తులో ఐఓటీ రంగంలో ఉద్యోగావకాశాలు,

భవిష్యత్తులో ఐఓటీ రంగంలో ఉద్యోగావకాశాలు,

20/February/2026 19:28    Share:   

దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆటానమస్  లో జరుగుతున్న ఐఓటీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ డోలా సంజయ్ గారు విద్యార్థులకు ఆధునిక ఐఓటీ సాంకేతిక పరిజ్ఞానంపై లోతైన అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన ఐఓటీ నిర్మాణ విధానం, పరికరం నుంచి క్లౌడ్ వరకు సమాచార మార్పిడి, సందేశ మార్పిడి విధానాలు, డేటా విశ్లేషణ, భద్రతా అంశాలపై సమగ్రంగా వివరించారు. 
పరిశ్రమల నాలుగో దశలో ఐఓటీ ప్రాముఖ్యత, స్మార్ట్ తయారీ, ముందస్తు యంత్ర సంరక్షణ వంటి ఆధునిక వినియోగాలను ఉదాహరణలతో తెలియజేశారు.
ప్రాయోగిక తరగతిలో విద్యార్థులు సెన్సర్ల సహాయంతో డేటాను సేకరించి, దానిని క్లౌడ్ సర్వర్కు పంపి, మొబైల్ మరియు వెబ్ డ్యాష్బోర్డ్ ద్వారా పరిశీలించే విధానాన్ని అమలులో చూపించారు. తక్షణ ఉష్ణోగ్రత పర్యవేక్షణ మరియు స్వయంచాలక హెచ్చరిక వ్యవస్థను ప్రత్యక్షంగా ప్రదర్శించారు.
విద్యార్థులకు చిన్న ప్రాజెక్టులపై మార్గనిర్దేశం చేసి, స్వయం ఉపాధి అవకాశాలు, సాంకేతిక పోటీలు, పరిశ్రమ శిక్షణల ప్రాముఖ్యతను వివరించారు. ప్రశ్నోత్తర కార్యక్రమంలో విద్యార్థులు ఐఓటీ రంగంలోని ఉపాధి అవకాశాలు మరియు అవసరమైన నైపుణ్యాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
డైట్ ప్రిన్సిపాల్ మరియు విభాగాధిపతులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇటువంటి శిక్షణలు విద్యార్థుల ప్రాయోగిక నైపుణ్యాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. 
ఈ కార్యక్రమం కి ప్రత్యేక సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న విభాగాధిపతి డా. కే. సుజాత గారు మాట్లాడుతూ  విద్యా పరంగా చూస్తే, విద్యార్థులు కేవలం సిద్ధాంత జ్ఞానం మాత్రమే కాకుండా ప్రాక్టికల్ పరిజ్ఞానం కూడా పొందాలి. ఐఓటి హార్డ్వేర్ ప్లాట్ఫార్మ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్, డేటా అనలిటిక్స్ వంటి అంశాలలో హ్యాండ్స్-ఆన్ అనుభవం అవసరం. ఇండస్ట్రీ ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్స్, వర్క్షాప్స్ ద్వారా విద్యార్థులు రియల్ టైమ్ అప్లికేషన్లపై పని చేయాలి అని వివరించారు.
ఈ కార్యక్రమంలో డీన్ అకాడమిక్స్ మరియు ట్రైనర్లు శ్రీ షేక్ జహీర్ మరియు శ్రీ జకారియా , విద్యార్థులు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు. పాల్గొన్న విద్యార్థులు ఆసక్తిగా ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో ఐఓటీ రంగంలో ఉద్యోగావకాశాలు, స్టార్టప్ అవకాశాలపై అవగాహన పెరిగిందని తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter