స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా,నిర్వహించడమే లక్ష్యం,జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా..

స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా,నిర్వహించడమే లక్ష్యం,జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా..

15/October/2026 20:40    Share:   

ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే అనర్హత వేటుతో పాటు కఠిన క్రిమినల్ కేసులు : జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా

అనకాపల్లి, అక్టోబర్ 15 :

జిల్లాలో త్వరలో జరగనున్న పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలను నూరు శాతం పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే పోలీసు శాఖ ధ్యేయమని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గురువారం జిల్లా పోలీసు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్. మోహన రావు, సబ్ డివిజన్ డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సమీక్ష సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

సెన్సిటివ్ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా :
జిల్లాలోని హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, నార్మల్ ప్రాంతాలను గుర్తించి, గత ఎన్నికల్లో జరిగిన నేరాలు, ఘర్షణల చరిత్ర ఆధారంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రౌడీషీటర్లపై బైండోవర్లు :
సమస్యాత్మక వ్యక్తులు, పాత నేరస్థులు, రౌడీషీటర్లపై ఎవరినీ మినహాయించకుండా వెంటనే బైండోవర్ చర్యలు తీసుకోవాలన్నారు.

ఎన్‌బీడబ్ల్యూల (NBWs) అమలు :
పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారంట్లను త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలని, లైసెన్స్డ్ ఆయుధాలను వెంటనే పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేయించాలని సూచించారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ పెంపు :
ఎంసీసీ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించడం లేదా కప్పివేయాలని, తనిఖీలను విస్తృతం చేసి కంటికి కనిపించేలా పోలీసు పహారా (Visible Policing) పెంచాలని ఆదేశించారు.

ఎన్నికల విధుల్లో పూర్తి అధికారాలు ఉంటాయని, ఏవైనా సంఘటనలు జరిగితే ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచిచూడకుండా తక్షణమే చట్టప్రకారం బాధ్యులపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అభ్యర్థులు, రాజకీయ పార్టీలు పాటించాల్సిన కీలక నిబంధనలు :

1. ర్యాలీల నిబంధన : వేర్వేరు పార్టీల అభ్యర్థులు ఒకే సమయంలో, ఒకే మార్గంలో ర్యాలీలు నిర్వహించరాదు. ముందస్తు సమాచారం అందించి నిర్దేశించిన సమయాల్లోనే వెళ్లాలి. ఘర్షణలకు దిగితే అల్లర్లు (Rioting), ప్రభుత్వ విధులకు ఆటంకం కింద తక్షణమే అరెస్ట్ తప్పనిసరి.

2. 48 గంటల ముందే అనుమతి తప్పనిసరి : సభలు, ర్యాలీలు, రోడ్ షోలకు 48 గంటల ముందే పోలీసు అనుమతి పొందాలి. ప్రచార వాహనాలకు పాస్ తప్పనిసరి. అనుమతి లేని వాహనాలను ఎన్నికలు ముగిసే వరకు సీజ్ చేస్తారు.

3. మైకుల వినియోగ పరిమితులు : ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మైకులు వాడాలి. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాల వద్ద (సైలెంట్ జోన్లు) మైకులు నిషిద్ధం. ఉల్లంఘిస్తే సౌండ్ సిస్టమ్స్, వాహనాలు సీజ్ చేయబడతాయి.

4. ప్రలోభాలపై ఉక్కుపాదం : ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, నగదు, బహుమతులు పంపిణీ చేయడం తీవ్రమైన నేరం. పట్టుబడితే ఎన్నికల కమిషన్‌కు నివేదించి అభ్యర్థిత్వాన్ని రద్దు (అనర్హత వేటు) చేయిస్తారు. అక్రమ రవాణాదారులపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు.

5. రూ.50,000 పైబడి నగదు రవాణాపై ఆంక్షలు : సరైన ఆధారాలు, పత్రాలు లేకుండా రూ.50 వేల కంటే ఎక్కువ నగదు గానీ, విలువైన వస్తువులు గానీ రవాణా చేస్తే తనిఖీల్లో సీజ్ చేస్తారు.

6. సోషల్ మీడియాపై నిఘా : వ్యక్తిగత దూషణలు, కుల-మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఫేక్ న్యూస్, మార్ఫింగ్ ఫోటోలు ప్రచారం చేస్తే ఐటీ చట్టం, సైబర్ క్రైమ్ కింద పోస్ట్ చేసిన వారితో పాటు గ్రూప్ అడ్మిన్లపైనా కఠిన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు.

7. ఆస్తుల ధ్వంసం - ఫ్లెక్సీల నిబంధనలు : ఫ్లెక్సీలు చించడం, దౌర్జన్యాలకు పాల్పడటం నేరం. అనుమతి లేకుండా ప్రైవేట్ ఇళ్లపై, ప్రభుత్వ ఆస్తులపై ప్రచార సామగ్రి ఏర్పాటు చేస్తే పబ్లిక్ ప్రాపర్టీ డిఫేస్‌మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, ఆ ఖర్చును అభ్యర్థి ఖాతాలో చేరుస్తారు.

"స్థానిక సంస్థల ఎన్నికలు మన గ్రామాలు, పట్టణాల భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఎన్నికలను పండుగ వాతావరణంలో, పూర్తి బాధ్యతాయుతంగా నిర్వహించుకుందాం. గెలవాలనే కసితో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే జీవితాంతం మాయని మచ్చలా క్రిమినల్ కేసులు నమోదవుతాయి. ఓటర్లు ఎటువంటి భయాలు, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి."
— శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్, జిల్లా ఎస్పీ, అనకాపల్లి

సమాచారం & ఫిర్యాదుల కోసం : ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, డబ్బు / మద్యం పంపిణీ, ఓటర్లను బెదిరించడం వంటి సంఘటనలపై ప్రజలు నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.

పోలీస్ ఎమర్జెన్సీ నంబర్లు : 100 / 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చు.

Breaking News

Subscribe our Newsletter