పట్టణంలో ఎంతో ప్రాచీన, ఆధ్యాత్మిక విశిష్టత కలిగి, భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న పట్టణంలోని ప్రముఖ శ్రీ వీరభద్ర స్వామి వారి దేవస్థానంలో మరో మహత్తర ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వీరభద్ర స్వామి వారి దేవస్థానానికి మంజూరైన వేద పారాయణ పోస్టులో ప్రముఖ వేద పండితులు, శ్రీ గాయత్రీ వేద పాఠశాల వేద అధ్యాపకులు బ్రహ్మశ్రీ శ్రీనివాస కులకర్ణి శనివారం వేదపారాయణదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ వీరభద్ర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ప్రత్యేక అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని పలువురు ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస కులకర్ణి ని ఘనంగా సత్కరించి, శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం. స్వామివారి నిత్య పూజలు, ఉత్సవాలతో నిత్యం కళకళలాడే ఈ దివ్య క్షేత్రంలో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం వేద పారాయణం ప్రారంభం కావడం అత్యంత శుభపరిణామం. వేద మంత్రోచ్ఛారణల ద్వారా ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వైభవం మరింత ఇనుమడిస్తాయి. భక్తులందరికీ ఆ పరమేశ్వరుని, వీరభద్ర స్వామివారి సంపూర్ణ ఆశీస్సులు లభించనున్నాయి" అని హర్షం వ్యక్తం చేశారు. ఈ విశేష కార్యక్రమంలో పురప్రముఖులు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పిల్లా రమాకుమారి, మళ్ళ కొండబాబు, శిష్ట్లా సన్యాసి రావు మాస్టారు, డాక్టర్ సాంబశివరావు, ఆడారి పూరి జగన్నాథ్, సుందరపు బాబ్జీ, పప్పు ఈశ్వరరావు , పట్టణ బీజేపీ శ్రేణులు, శ్రీ గాయత్రీ వేద పాఠశాల గౌరవ అధ్యక్షుడు చంద్రమౌళి సోమేశ్వరరావు, పాఠశాల కార్యదర్శి పెద్దింటి సూర్యనారాయణమూర్తి, శిష్ట్లా వెంకటేష్, భాగవతుల సాయి, రాచకొండ శ్రీను తదితర పురప్రముఖులు, శ్రీ గాయత్రీ వేద పాఠశాల మరియు గోశాల కార్యవర్గ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు. అనంతరం వేద పారాయణదారు శ్రీనివాస కులకర్ణి శ్రీ వీరభద్ర స్వామివారి దివ్య కృపతో భక్తులందరి శ్రేయస్సు కోరుతూ నిత్య వేద పారాయణ సేవలను భక్తిప్రపత్తులతో కొనసాగిస్తానని పేర్కొన్నారు.