కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు,
ఏలూరు,
కోట్లాది రూపాయల నిధులతో ఏలూరు నియోజకవర్గంలోని రహదారులను దశలవారీగా అభివృద్ధి చేస్తూ వస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం కాకుండా వాస్తవంగా కార్యరూపం దాల్చాలని తాను అనునిత్యం భావిస్తూ ఉంటానని, అందుకు ప్రతీకగానే తాను పనిచేసుకుంటూ వెళ్తున్నానంటూ ప్రజల కరతాళ ధ్వనుల మధ్య ఆయన స్పష్టం చేశారు. ఏలూరు నగరపాలక పరిధిలో 62 డివిజన్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లకు కానుకగా అందించాలని, తద్వారా ఏలూరు ప్రతిష్టను మరోసారి నిలపాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగానే నియోజకవర్గంలో మరో దఫా అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేశారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి.. దానిలో భాగంగానే ఎన్‌క్యాప్ నిధులు 6కోట్ల, 57లక్షల రూపాయల వ్యయంతో నగరంలోని 5 ప్రధాన ప్రాంతాల్లో బిటి రోడ్ల నిర్మాణానికి గురువారం ఆయన శ్రీకారం చుట్టారు. స్థానిక బుద్దా పార్కు నుండి సత్యనారాయణ ధియేటర్ మీదుగా పాతబస్టాండ్ రోడ్డులోని బడేటి చౌక్ వరకు, అలాగే స్థానిక ఫిల్‌హౌస్ పేట అంబేద్కర్ విగ్రహం నుండి మాదేపల్లి బైపాస్ రోడ్డు వరకు, బిర్లా భవన్ నుండి చేపల మార్కెట్ వరకు, స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంక్ నుండి బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు, కండ్రికగూడెం సెంటర్ నుండి అశోక్ నగర్ బ్రిడ్జి వరకు నూతనంగా నిర్మించనున్న బిటి రోడ్లకు ఎమ్మెల్యే బడేటి చంటి శంకుస్థాపనా కార్యక్రమాలను నిర్వహించారు. శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. తాజాగా 6కోట్ల, 57 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసిన ప్రధాన రహదారులన్నింటినీ 15 నుంచి 20 రోజుల లోపుగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వెనక్కి వెళ్ళిపోయిన నిధులను తిరిగి రప్పించేందుకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే వీటితోపాటు మరో ఐదు ప్రధాన రహదారుల అభివృద్ధి పనులకు అవసరమైన 4కోట్ల 72 లక్షల రూపాయలు కూడా త్వరలోనే రానున్నాయని ఆయన తెలిపారు. ప్రజల రవాణాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రహదారుల నిర్మాణం విషయంలో ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తున్నట్లు పేర్కొన్నారు. తాను ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎక్కడ శిలాఫలకాలు ఆవిష్కరించడం లేదంటూ వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, కేవలం పని పూర్తైన ప్రదేశాల్లోనే శిలాఫలకాలు కనిపిస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు. రహదారులను సంరక్షించుకునే బాధ్యతపై ప్రజలకు కూడా ఉందని ఆయన సూచించారు. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో ప్రజలకు అనునిత్యం దగ్గరగా ఉంటూ వస్తున్న విషయాన్ని ఉదహరించిన బడేటి చంటి రోడ్ల ప్రాధాన్యతను గుర్తించి రహదారుల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. రహదారులు బావుంటేనే వ్యాపారాలు సైతం పెరుగుతాయని, ఈ విషయంలో అంతిమంగా లబ్ది పొందేది వ్యాపారస్తులేనని ఆయన వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధిని చేతల్లో చేసి చూపిన కూటమి అభ్యర్థులను ప్రజలు ఏకపక్షంగా గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. స్వేచ్ఛాయుతమైన వాతావరణంతో పాటు ప్రశాంతమైన ఏలూరుకు ప్రజలు జైకొట్టాలని ఆయన సూచించారు. ఏ నియోజకవర్గంలోనూ జరగని విధంగా ఏలూరులో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు మీరావలీ, ఏపి మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, మాజీ డిప్యూటి మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, నాయకులు మారం అను, ఈతకోట శ్రీనివాసరావు, పూజారి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు...